అమెరికాలో శివాజీ సినిమా: తటస్థ Review

నేను నిన్న శివాజీ సినిమా చూడడానికి వెళ్ళాను. దాని మీద రివ్యూ వ్రాస్తున్నాను. 

ముందుగా ఈ టపా స్పాన్సర్ల నుండి ఒక ప్రకటన.

నేడే చూడండి. వికీపీడియా. జీవితం లో సమస్యలా, ఆధునిక యాంత్రిక జీవితాన్ని అర్ధంచేసుకోలేక తికమకా ? ఏది మంచో ఏది చెడో తెలియక అయోమయమా? అయితే నేడే చదవండి వికీపీడియా. మీ జీవిత సమస్యలకు ఒక తటస్థ మరియు విశాల, మరియు లోతైన సమాధానాల విజ్ఞాన సర్వస్వం. ఒక్కసారి చదవండి ఇక మీ పిల్లలముందు ఎప్పుడూ ‘తెలియదమ్మా బంగారూ’ అని ఎర్రోళ్ళు అవ్వక్కర్లేదు.

Disclaimer: అప్పుడప్పుడూ (అంటే చాలా సార్లు)మీకు కావలసిన వ్యాసాలు ఉండక పోవచ్చు (అంటే ఉండవు) అటువంటి సందర్భాలలో మీరే వ్రాసి చదువుకోవాల్సి వస్తుంది.

ఇక రివ్యూకి వస్తే…
నేను ఉండేది అమెరికా లోని ఓక పెద్ద మహానగరంలో, మా నగరంలో, వాళ్ళ స్వస్థలంలో తోటి తెలుగు వారిని తట్టకోలేక అమెరికా కి పరుగుతీసినవారి సంఖ్య చాలా ఎక్కువ. అందుకనే శివాజీ లాంటి సినిమాలు రాత్రి పదకొండింటి ఆట అయినా నిండు గా ఆడతాయి.

నేను నా ఫ్రెండ్ ఆనందం, తెలివిగా పదకొండింటి ఆటకైతే ఎవరూ ఉండరని ఆ ఆటకి టికెట్లు తీసుకున్నాము. తీసుకున్నాము అంటే వెబ్ లో తీసుకున్నాము, కానీ అలా తీసుకుంటే టికెట్టు వస్తుందని నమ్మకంలేదు.

ఎందుకంటే మనోళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడడం, లేదా తీసుకున్న డబ్బు మీద గౌరవం వంటివి కొద్దిగా తక్కవ!  వంద సీట్లుంటే, ఎందుకైనా మంచిది, రిస్క్ ఎందుకని, నూటేబై టికెట్టుఅమ్ముతారు. అందుకనే పదింటికే బయలు దేరి వెళ్ళాము. వెళితే అక్కడ టికెట్లకు లైను ఉండనే ఉంది. మేమూ లైనులో నిలబడ్డాం.

నా ముందున్న ఆంటీ వంతు వచ్చింది టికెట్లు తీసుకోవడానికి. ఆమే తీసుకోని “ఏవండి three టికెట్లే కదండి ఇందులో ?” అని అడిగింది ఆ టికెట్ అబ్బాయిని. నేను వెనకాల వాంతు ఆపుకొని, నాలో నేను ఇలా అనుకున్నాను, “three టికెట్లేంటమ్మా? three టికెట్లు”, “Why don’t you just turn around and kick me in my nuts? That would be less painful than having to hear the phrase, three టికెట్లు”. నాకు బాగా తిక్క రేగినప్పుడు ఆంగ్లం లో బూతులు వస్తాయి. నాకు ఈ కొజ్జా భష విన్నప్పుడల్లా చెప్పలేని తిక్క రేగుతుంది.

ఇంతకీ టికెట్లు తీసుకొని, “అహ్ ఇంకా లైను లేదు, పదకొండింటి ఆటకి వచ్చి మంచి పని చేసాం” అని మురిసి పోయాడు మావోడు.

ఈ తెల్లోళ్ళు చలి వల్లనో మూర్ఖత్వం వల్లనో గాని అన్ని భవంతులు గొట్టాల్లా కడతారు, తియేటర్ ద్వారాలతో సహా. అమెరికా లో ఎవరూ సినిమాలు అంతగా చూడరు కాబట్టి పర్లేదు కాని మన దేశీ జనాబా అంతా వెళ్ళి తియేటర్ మీద పడ్డప్పుడు అ గొట్టాల్లో తొక్కిసలాట జరుగుతుందేమో అనిపిస్తుంది.

షో మొదలవడానికి ఇంకా 15 నిమీషాలే ఉన్నాయి. లైను పెద్దగా లేదు. లైను పక్కనే నీళ్ళుంటే తాగడానికి అటుపక్క తిరిగా , తాగి చూస్తే పెద్ద లైను వచ్చేసింది. మా వోడు లైను వెనక్కి వెళ్దామన్నాడు గాని, నేను దేశీయాపా లో బాగా ట్రెయినింగ్ ఉన్న వాడిని కాబట్టి నేను నుంచున్నకాడ దూరిపోయాను, మావోడికి లైన్లు ఇష్టం లేవు కాబట్టి వాడు తియేటర్ బయటకు పోయి, కూలి పోయిన వాడి ప్రేమకథని బతికించుకోవడానికి వృధా ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు.

లైనులో 8 నుండి 80 వలకూ అన్ని వయసులవారు ఉన్నారు. అదీ రాత్రి పదకొండింటికి. ఒకావిడ మొన్నే భీమవరం నుండి వచ్చినట్ట్టుంది. ప్రసాద్’s ఈ చెత్త థియేటర్ కంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటుంది.

నాముందేమొ మొన్నే భారద్దేశం నుంచి వచ్చిన కొత్త విధ్యార్ధి ఒకడు ఉన్నాడు. నేను లైనులో ఉన్నంత సేపు ముక్కు మూసుకోవలసి వచ్చింది. అది కాక వెరెవరినుండో ఎదో వంటల కంపు కూడా వస్తుంది. పోనిలే ఇంకా పది నిమిషాలేగా అని సర్దుకుపోయా.

క్యూ అంటే ఆంగ్లంలో వరుస క్రమంలో ఒకరి తరువాత ఒకరు నించోవడం అన్న మాట, కాని మన వాళ్ళకి వచ్చే సరికి , క్యూని ఒక linear geometric model తో వర్ణించడం అసాధ్యం. మన వారి ప్రవర్తన ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆందుకనే దాన్ని quantify చెయ్యడానికి మీకు Bessel functions మరియు fractals అవసరమవుతాయి. మామూలు binomial trees కూడా ఎమూలకూ సరిపోవు. అమెరికా లో అమెరికన్లు క్యూ కడితే ఏం జరుగుతుందంటే ఒకరి తరువాత ఒకరు వస్తారు. కానీ ఇక్కడ ఒకరి తరువాత పది మంది వస్తారు, ఆ పది తరువాత 100, ఆలా పెద్ద సంఖ్యలలో వస్తుంటారు, నేను దీన్ని geometric browninan motion గా వివరించి PhD పట్టా పొందేయొచ్చని మహదుపాయం పొందాను అక్కడ.

క్యూలా మాతో పాటు ఒ తెల్లాయన కూడా ఉన్నాడు. అతను ఎప్పుడో ఏ శంకరాభరణమో చూసి, అన్ని తెలుగు సినిమాలూ అలా ఉంటాయని తెలుగు అమ్మాయితో సహవాసం చేసినట్టున్నాడు. కాని నాకు ఆయన ఆ మహాక్యూలో కూడా చాలా సంతోషం గా కనిపించాడు. జాతాంతర వివాహాలు చేసుకున్నవారు చాలా మంది చాలా ఆనందంగా కనిపిస్తారు ఏంటో మరి.

నా పక్కన ఉన్న ఇంకో జంటకు ఇద్దరు పిల్లలున్నారు ఆరు పది సంవత్సరాల వయస్సుంటుంది ఆ పిల్లలకి. బాబు పెద్దోడు తట్టుకోలేక “అమ్మా మనము ఈ సినిమా చూడాలా ” అని అడిగాడు. పిల్లేమో “నాన్న ఎత్తుకో ఎత్తుకో ” అని మారాం పెడితే, నాన్న ఎత్తుకున్నారు. పక్కనే వెండింగ్ మెషీన్ ఉంటే దానికి చెయ్యచాపడం మొదలు పెట్టింది పిల్ల. అమ్మ “Baby, baby, dont do that, dont do that” అని ఏదో క్రిష్టీనా ఆగ్యులెరా పాట పాడుతున్నట్టు చెప్పింది.

వారి వెనక ఒక టీనేజి అన్నా చెల్లెల్లు ఉన్నారు, వాళ్ళేమో ఆంగ్లంలో ఎదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని కాస్తా క్యూని ఇస్తిరి చేసినప్పుడు, “దేవుడా ఈ దేశితనం ఏమిట్రాబాబు” అని అనుకుంటున్నారేమొ అనుకున్నా కాని వారు సంతోషం గానే ఉన్నారు. చిన్నప్పట్నుంచి దేశీ సినిమాలకి వచ్చి వచ్చి అలవాటనుకుంట. నాకేతే మా రాజమండ్రిలో మా కారులో కూర్చుంటే, మా డ్రైవర్ వెంకటరావు వెళ్ళి టికెట్ తేవడం అలవాటైపోయి, ఈ చెత్త నగరంలో చాలా చిరాకుగా అనిపించింది.

థియోటర్ అయితే మా పిన్నాళ్ళ ఊర్లో డబ్బా థియేటర్ కంటే బాగుందని సంతోషం వేసింది. మా పిన్నాళ్ళ ఊరంటే షికాగో అన్నమట. అక్కడ మంచి తియోటర్ల యాజమాన్యాలు, దేశీలు వాళ్ళు థీయేటర్ ఇమేజ్ ని పాడుచేస్తారని మన వారికి థియేటర్ అప్పివ్వకుండా ఉండడానికి తెలివైన ఉపాయాలు వేస్తూంటారు. ముఖం మీద మీ సామన-ఛాయ ముఖాలకి థియేటర్ ఇవ్వమంటే, బొక్కలో తోస్తారు, కాబట్టి వాళ్ళు తెలివిగా మన వాళ్ళు రెంటుకి అడిగినప్పుడు fair price అడుగుతారు, మన వాళ్ళు అంత డబ్బుని ఇచ్చుకోలేరని తెలిసి. అప్పుడు మన వాళ్ళు పాత బడ్డ థియేటర్ ఒకటి పట్టి , ఆత్మాభిమానం ఉన్న ఏతెల్లవాడూ, మత్తులో లేని ఏ నల్లవాడూ, రాని రెకుల షేడ్డులో బొమ్మలు ఆడిస్తారన్నమాట.

11:15 అయ్యింది అయినా ఇంకా ముంది షో అయినట్టులేదు. థియేటర్ నుంచి ఎదో పులి శబ్ధాలు వగైరా వస్తున్నాయి. అప్పుడు అర్థమయ్యింది , ఇది అమెరికా అయినా, వచ్చింది దేశీ సినిమాకే అని కాబట్టి ఒక అరగంటైనా ఆలస్యంగా మొదలు పెడతారని. టికెట్ కలక్టర్ మాత్రం వేసవి కాలం సెలవలు ఉద్యోగం చేస్తున్న విధ్యార్థులు అని పించింది. వాళ్ళు ఎందుకో గాని వచ్చే ఏడు నుండి దేశీ గోల లేని తియేటర్ కి వెళ్దామనుకుంటున్నట్టున్నారు.

ఈ లోగా లైనులో ఉధ్రిక్తత పెరిగింది. మన వాళ్ళు తమ competetiveness ని మెరుగు పరచుకోనడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ పక్కలో చోటు ఉంటే ఇస్ ఇస్ అని వాళ్ళ వారికి సైగలు చేయడం వగైరా వగైరా. ఇంకొంతరైతే థియేటర్ ద్వారం దగ్గర మరుగుదొడ్ల పక్కనే మకాం వేసారు, అక్కడి నుండి తేలికగా లోపలికి చొరబడడానికి. పురుషుల మరుగుదొడ్లకాడ స్త్రీలు , స్త్రీల దొడ్లకాడ పురుషులు తిష్టవేసారు.

ఇంతా చేసి ఆఖరికి ఆట అవ్వనే అయ్యింది.

బయటకి రావడానికి అప్పుడే సినిమా చూసి మోక్షం పొందిన వారు క్యూ కట్టారు. అప్పుడు రెండు bessel functions గుద్దుకొని ఒక complicated pattern ఏర్పడింది. Bessel దానిని చూస్తే బిత్తర పడి, దానికి equationలు కనిపెట్టలేక ఆత్మహత్య చేసుకునేవాడు.

ప్రతి మంచి తెలుగు అబ్బాయిలాగా నాకు కూడా మా మహా నగరంలో గొందుగొందుకూ చుట్టాలున్నారు. కాబట్టి వాళ్ళలో ఎవరు కనబడి, నా చదువుగురించి ఎం ప్రశ్నలు అడుగుతారో అని నా ముందున్న ఆంటీ వెనక దాక్కోవడం మొదలు పెట్టా, కానీ ఆవిడ నా కంటే ఒ అడుగు లోతున ఉండడం వల్ల ప్రయోజనం లేకపోయింది. అదృష్టవసాత్తూ నాకు తెలిసినవారు ఎవరూ రాలేదు. కాని, నా ముందున్న వారికి తెలిసిన వాళ్ళు వచ్చారు, ఆయనని నా ముందున్న ఆయన అడిగారు “ఎలా ఉంది సినిమా” అని. ఆయన మామూలుగా జెమిని టీవీలో చూపించినట్టు “యావరేజి” అండి అన్నాడు. నా ముందున్నాయన, యావరేజీ సినిమా కోసమా ఇంతసేపు లైనులో నిలబడింది అని బాధ పడ్డాడు.

లోపలికి వెళ్ళాము.

నేను లైను ముందులోనే ఉన్నా, నా కన్నా ఒ నలుగురు నా ముందో లోనికి దూరారు, కాబట్టి నేను వెళ్ళే సరికి సగం థియేటర్ నిండిపోయింది. ఒక సీటు దగ్గరకి వెళితే, “లేదండి, ఈ వరుస మరియు దీని ముందు వరసా అంతా బుక్డు అండి” అన్నారు. నేను థియెటర్ మధ్యలోకి వెళ్ళి కూర్చున్నా. మా వాడికోసం పక్క సీటు ఆపా.

మా రాజమండ్రిలో అయితే నేను బల్ల వర్గంలో అంత ముందు వరుసలో కూర్చోవడం అసంభవం, కాని వేమన గారు అన్నట్టు “అనువుగాని చోట బాల్కనిలో కూర్చోరాదు” అని నేను సరిపెట్టుకున్నాను, కాని నాకు కంట నీరు ఆగలేదు. కళ్ళుతుడుసుకొని మా ఆనంద్ గాడికి మా సీట్ల co-ordinates ఇచ్చా.

నా ముందు వరుసలో ఒకాయన కూర్చున్నారు, అంటే ఒకాయన మాత్రమే కూర్చున్నారు, ఆయన మిగతా వరసనంతటిని వారి వారికోసం ఆపారు. అమెరికా వచ్చిన అందరూ దేశీలకు మల్లే ఈయనకు కూడా తోటి దేశీని తన బెల్లం మీద వాలిన ఈగలాగ చూస్తాడన్నమాట. అంతకన్నా చిన్న చూపుతో ఎవరూ ఎవరినీ చూడలేరు. తెల్లవారికైతే ఆ విధ్య అస్సలు తెలియదు (వాళ్ళు బిచ్చగాళ్ళని కూడా సర్ అంటారు). ఎవరైనా ఆ వరుస దగ్గరకు వస్తే, “హలో హలో  వస్తునారు” అని గట్టిగా కుక్కని తరుముతున్నట్టు కేకలేసేవాడు. ఒ ఇద్దరు వచ్చి ఆయని తో గొడవ పెట్టుకొని వెళ్ళరు. వాళ్ళు కూడా ఇతనిని ‘వాళ్ళ నోట్లోనుంచి బెల్లంముక్క లాక్కుంటున్న ఈగ’ లాగ ఒక హీనాతి హీనమైన ఒక లుక్కు ఇచ్చి పోయారు. వాళ్ళెవరూ, ఒక తెల్లవాడితో ఆలా ప్రవర్తించే ప్రసక్తి లేనేలేదు. తోటిదేశీలను చూస్తేనే, ‘తోటి దేశీ కుక్కోభవః’ అని గుర్తుకువస్తుంది.

ఆయన బాధ నాకు అర్థమయ్యింది, “లైనులో ముందు నించున్నందుకు నేను ఎర్రి పూనా ?” అని ఆయని ఆవేధన! ఇంతకూ చూస్తే ఆయన సీట్లు ఆపింది పిల్లలకోసం. నాకని పించింది. “You sonnova&*^%, why the heck did you bring kids under the age of six to such a movie? at such a time in the night? and why can’t you tell people that you have kids and you are holding seats for them, instead of shooing people like you shoo dogs.”

నేనుకూడా మావోడి కోసం సీటు ఆపా కాని నేను ఎవరితోను గొడవ పెట్టుకోలేదేగా. “సారి అండి పిల్లలు వస్తున్నారు” అంటే వదిలిపోయేదానికి ఈ శునకావేశం ఎందుకు? మా ఊరు బాల్కనీ లో ఐతే సీటు సంఖ్యలుంటాయి. అందరూ బుధ్ధిగా వారి సీట్లోలో కూర్చుంటారు. బల్ల మీద జనాలు కూడా అలా కొట్టుకోరు. కాని ఎం చేస్తాం వేమన గారు చెప్పినట్లు “కనకపు సింహాసనం మీద శీవాజీ సినిమా చూసిన”.

నా పక్కసీటులో మొన్నే యాద్‌గిరి నుంచి దిగిన ఒకతను కూర్చున్నాడు. నేనతనిని చూసి నిజంగా నేను ఆంధ్రలోనే ఉన్నానేమొ అనుకున్నాను. హైదరాబదులో కనిపిస్తుంటారుగా , “క్రెడిట్ కార్డు తీసుకోండి సార్” అంటూ, పుల్ హాండ్స్ గళ్ళ చొక్క , గోదుమ రంగు బెల్టు, తెల్ల పాంటు, ఎక్కడ ఎ పొంతన లేకుండా బట్టలు వేసుకుంటారే.. ఆలాంటోకాయన. నేను తెలుగులో మాట్లాడుతున్నా అతనితో, అతనేమో ఎదో భాషలో మాట్లాడుతున్నాడు. నా కర్థం కాలేదు ఎ భాషో , అయనని అడిగా మీకు తెలుగువచ్చా అని. అతను మాత్రం అతని వింత భాషలోనే మాట్లాడుతున్నాడు. అప్పుడర్థమయ్యింది అది వచ్చీరాని ఆంగ్లం అని.

ఇంకా తట్టుకోలేక ఏడవడం మొదలు పెట్టేసరికి,

ఆపద్భాందవుడిలా మావోడు వచ్చాడు. తరువాత సినిమా మొదలయ్యింది. ఎదో అరవ పేర్లు వస్తున్నాయి ఎంత సేపూ..ఆ తరువాత ఒ పెద్దాయన వచ్చాడు. ఆ తరువాత శ్రీయా వచ్చింది. ప్రపంచం అంతా ఆనందభరితమయ్యింది ఇంకోసారి. మధ్యలో శ్రీయా శ్రీదేవి లెక్క డేన్స్ కూడా వేసింది. నాకైతే మళ్ళీ మా ఊరు గుర్తుకువచ్చింది. కాని ఈ సారి శ్రీయా ఉందని పెద్ద బాధ వెయ్యలేదు.

తణుకులో మా మావయ్యగారి పొలాల్లో చైత్ర మాసంలో అప్పుడే వండిన కొత్త బెల్లం ముక్కలా… చూడడానికి బంగారంలా, తినడానికి తియ్యగా, ముట్టుకోవడానికి వేడిగా …. అన్నట్టుంది శ్రీయా.

సవరణ: నేను సినిమా కి వెళ్ళడం గురించి రివ్యూ అని చెప్పనే చెప్పాను. 

Published in: on జూన్ 18, 2007 at 5:06 సా.  12 వ్యాఖ్యలు  

జనాలు మంచోళ్ళు

మొన్న శీనుగాడు కాలేజి గ్రంథాలయానికి వెళ్ళాడు.

శీను గాడికి వాళ్ళ అమ్మ చెప్పేది, ఎప్పుడూ జనాలంటే ఇష్టముండాలని. ఉగ్గుపాలతో పెట్టింది కాబట్టి శీనుగాడికి జనాలంటే నిజంగానే చాలా ఇష్టం ! ప్రపంచం చెడ్డదని తెలుసు కానీ దానిని జీర్ణుంచుకొనే శక్తి లేదు. జీర్ణంచుకోగలిగినా, జనాలంటే ఇష్టంలేని ప్రపంచంలో బతక లేడు కాబట్టి జీర్ణించుకోడు. దానికి వ్యతిరేకమే నిజం అని నిరూపించడానికి అప్పుడప్పుడూ చాలా విచిత్రమైన పనులు చేస్తూంటాడు.

ఉదాహరణకు, వాడొకసారి బెంగుళూరు దగ్గర కృష్ణరాజపురం రైలు నిల్దాణ బయట నుండి లోపలికి రెండు పెద్ద పెట్టెలు తీసుకువెళ్ళాల్సుంటే. వాడేం చేసాడో తెలుసా ?
ముందు కూలీ కోసం చూసాడు. దొరకలేదు. జనాలు మంచి వారని నిరూపించడానికి ఇదే మంచి అవకాశమని, వాడు ఒక పెట్టెని బయట రోడ్డు మీద వదిలేసి, ఇంకోదాన్ని లోపలికి తీసుకువెళ్ళి, దానిని అక్కడ వదిలేసి బయటకు వచ్చి రోడ్డు మీద దానిని లోనికి తీసుకువెళ్ళాడు. రోడ్డుమీద పెట్టెనీ ఎవరు ఎత్తేయలేదు, స్టేషన్లో ని పెట్టెనీ ఎవరూ ఎత్తేయలేదు. వాడి నమ్మకం ఋజువయ్యింది. ఎంతయినా పెట్టెల్లో వాడి పాస్పోర్టు మరియు వచ్చేవారం అమెరికాకి పై చదువులకి వెళ్ళడానికి కావలసిన వీసా ఉన్నాయి.

అది జరిగి రెండు సంవత్సరాలయ్యింది. మళ్ళీ ఆ విషయాన్ని నిరూపించే సమయం దగ్గర పడింది.
గ్రంథాలయంలోని ఎప్పుడూ వెళ్ళని ఓ కొత్త ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి చదువుకునే బల్ల దగ్గర చదువుకుంటున్నాడు. శీను అక్కడికి వెళ్ళగానే, అతను, మీ దగ్గర ఫోన్ ఉందా? నేను దానినొకసారి వాడుకోవచ్చా అని అడిగాడు. శీనుగాడు సంతోషంగా ఫోన్ తీసి ఇచ్చాడు. మాటలో మాట అన్నట్టు మనోడు అతనిని, ఇక్కడ దగ్గరలో మూత్రాలయం ఎక్కడ ఉంది? అని అడిగాడు. దానికతను, “దగ్గరలో లేదు, ఆ పక్క వింగులో ఉంది” అని బదులిచ్చాడు. మనోడు, “సరే నేనక్కడికి వెళ్ళి వస్తాను, నా బ్యాగ్ కాస్త చూస్తావా?” అని అడిగాడు. అతను సరే అన్నాడు.

మనోడు తాపీగా మూత్రం విడిచి వచ్చే సరికి అక్కడ బేగ్గూ లేదు, ఫోనూ లేదు, మనోడి సరికొత్త ప్రాణనేస్తమూ లేడు. మనోడికి నమ్మసఖ్యం కాలేదు.  ‘బాగ్ బరువుగా ఉందని దానితో పారిపోయాడేమో’ అనే సందేహం వచ్చింది గాని, ఊహుఁ, అసంభవం!
‘ఓ..’ ఇప్పుడ అర్థమయ్యింది, ‘అతను ఎవరికో కాల్ చేసుంటాడు, వారికి సీరియస్ గా ఉండుంటుంది, ఇతను వెంటనే వెళ్ళాల్సివచ్చి వెళ్ళపోయింటాడు. అంతే అయ్యింటుంది కచ్చితంగా…’

క్రిందికి వెళ్ళి గ్రంథాలయ ముఖద్వారం దగ్గర గార్డుని అడిగాడు,

         ఇక్కడ ఎవరైనా బేగ్ గాని ఫోన్ గాని వదిలి వెళ్ళారా ?
         ఫోను వదల్లేదు గాని ఇదిగో ఈ కాళీ బేగ్ వదిలి వెళ్ళింది ఒక అమ్మాయి.
         ప్చ్ అది నాది కాదు, నా బేగులో లాప్ టాప్ ఉంటుంది.
         ఔనా ? నోటీసు చూడలేదా ? లాప్ టాప్ ని వదిలేసి వెళ్ళకూడదు!
         హుఁ
         పోలిసుల్ని పిలవమంటావా ?
         వద్దు , అతనికి కాల్ చేస్తాలే. పర్లేదు.

మనోడు కాల్ చేసి మెసేజ్ వదిలాడు, ఎప్పటికైనా తన లాప్ టాప్ మరియు ఫోన్ తిరిగి వస్తుందని నమ్మకంగా ఉంది. కాని ఉద్యోగం వెతుక్కునే సమయం కాబట్టి లాప్ టాప్ మరియు సెల్ లేక పోవడం నిజంగా దురదృష్టకరం.

కానీ జనాలు మాత్రం మంచోళ్లు.

Published in: on జూన్ 11, 2007 at 3:16 ఉద.  వ్యాఖ్యానించండి  

ఈ-సామెత

భాష ఎప్పుడూ మారుతూ ఉంటుందంటారు ఆర్యులు.

ఆలాగే తెలుగు లో కొత్త తరం సామెత ఒకటి

“పావలా సాఫ్టువేరు కి పది రుపాయల డిస్‌క్లైమర్ ఇచ్చాడంట ఎనక ఎవడో”

Published in: on మే 22, 2007 at 12:43 ఉద.  వ్యాఖ్యానించండి  

లంచగొండి కొడుకు

మిట్ట మధ్యాహ్నం కారులో చిన్నకుటుంబం ఒకటి. ఇంటినుండి సరదాగా బయటకు వెళుతున్నారు.
పచ్చ దీపం ఎరుపుకు మారింది. కారు మెల్లగా ఆగింది.

అమ్మ ఎప్పటి నుండో అడగాలనుకుంటుంది
“ఏవండి, ఆ ఇళ్ళ నిధులు వచ్చాయా”
అయ్యకేమో పని గురించి మాట్లాడడం అంత ఇష్టం లేదు. అదీ బల్లక్రింది వ్యవహారం. మాటలాడం లో ఆశక్తి లేదని తెలియజెప్పడానికి నీరసం గా “ఊఁ” అని సమాధానమైతే ఇచ్చాడు.
” మనకు ఎంత వస్తాయంటున్నారండి? ”
” చూడాలే ఆ ప్యూను జగన్నాథం మరీ అన్యాయంగా మాట్లాడుతున్నాడు. పెద్దా చిన్నా లేకుండా పోతుంది ఈ మధ్య ఆఫీసులో ”
” తొందరగా వస్తే, బాబ్లీ అమెరికా చదువుల కోసం ఆ స్ధలం కొనోచ్చు, అసలే ఈ మద్య స్కాలర్ షిప్పులు రావట్లేదట, రేఖ గారి అబ్బాయికి కూడా రాలేదట ”
భార్య చాలా దూరం ఆలోచించినా, పిల్లాడి చదువులకోసం భూమి ఎప్పటికైనా కొనల్సిందేగ్ అని “ఊఁ” అన్నాడు.

ఈలోగా వెనక సీటులో పన్నెండేళ్ళ బాబ్లీ కిటికీ మీద టక్ టక్.
“బాబూ బూర కొనండి బాబూ, పిచ్చుక బూర బాబూ, ఊదితే రెక్కులు వస్తాయి” ఆకుర్రాడికి కూడా బాబ్లీ వయసుంటుంది.
“నువ్వేంచేస్తూంటావ్”
“బడికేళ్తూ ఆదివారం ఇలా ఏదోటి అమ్ముతుంటాను”
“ఎంత బూర ఒక్కోటి?”
“పది రూపాయలు”
“ఐతే ఒ ఐదు ఇవ్వు” పాకెట్ మని తీసిచ్చాడు.
“ఐదా?” ఐదు బూరలు ఒకరికే అమ్మడం ఇదే మొదటి సారి అతనకు.
“ఊఁ, నా స్నేహితులు చాలా మంది ఉన్నారులే”
“థాంక్స్”
“ఇంతకీ ఎక్కడుంటావేంటి ?”
“సత్యవాడ”

ట్రాఫిక్ దీపం పచ్చకు మారింది, కారు కదలసాగింది.
“ఇంతకూ ఏ వాడలో ఇళ్ళకోసమండి అవి?”
“ఎన్ని ప్రశ్నలడుగుతావే, నస”
“ఇంకా అడగను లెండి ఐతే”
“సత్యవాడ”

Published in: on మే 1, 2007 at 7:02 సా.  3 వ్యాఖ్యలు